
భారత ఆటో మార్కెట్లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించేది మైలేజ్ ఎక్కువగా అందించే చిన్న కార్లనే. ఇవి తమ కుటుంబ ప్రయాణానికి బడ్జెట్లో అందుబాటులో ఉంటాయని భావిస్తుంటారు. అందుకే సేఫ్టీ ఫీచర్లు కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఇలాంటి మోడళ్ల కార్లను ప్రజలు ఎక్కువగా కొనుగోలుకు ఇష్టపడుతుంటారు.
అయితే త్వరలోనే ఈ సెగ్మెంట్ కార్ల నిబంధనలు పూర్తిగా మారనున్నాయని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తీవ్ర లాబీయింగ్ తర్వాత, చిన్న కార్లకు ఇంధన సామర్థ్య నిబంధనలను సడలించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆల్టో, వ్యాగనార్ వంటి మోడళ్ల విక్రయాలు తగ్గుతున్నందున కేంద్రం త్వరలో తీసుకురానున్న పొల్యూషన్ రూల్స్ వాహన మార్కెట్ మెుత్తంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మారుతీ భావిస్తోంది.
అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ చిన్న కార్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలించాలని సంస్థలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా చిన్న కార్ల అమ్మకాలు తగ్గటంపై ఆందోళనలో ఉన్నందున అదనపు ప్రయోజనాలు అందించే దిశగా కేంద్రం యోచిస్తోందని తేలింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1,000 కిలోల కంటే తక్కువ బరువున్న కార్లకు అనుమతించదగిన కార్బన్ డయాక్సైడ్ ఉద్గార పరిమితిని సడలించాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడైంది.