కరోనా తర్వాత జీవన ప్రమాణాలు మంచిగైనయా.. ? కేంద్రం సర్వే

కరోనా తర్వాత జీవన ప్రమాణాలు మంచిగైనయా.. ? కేంద్రం సర్వే
  • కరోనా తర్వాత జీవన ప్రమాణాలు మంచిగైనయా?
  • విద్య, వైద్యం, ఆదాయం పరిస్థితేంటీ? 
  • కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ శాఖ సర్వే  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు? కరోనా తర్వాత ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? విద్య, వైద్యం, ఆదాయం వంటివి ఎలా ఉన్నాయి? అన్న వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు అందుతున్న విద్య, వైద్యం, ఆర్థిక వనరులు(వ్యవసాయం, ఉపాధి, స్వయం ఉపాధి), అహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు, తదితర14 అంశాలపై ఈ మేరకు సర్వేలో భాగంగా వివరాలు సేకరిస్తున్నారు. నవంబర్ లో మొదలైన ఈ సర్వే 2023 జూన్ వరకు కొనసాగనుంది. ఒక్కో జిల్లాలో మండలానికి రెండు గ్రామాలు,  మున్సిపాలిటీల్లో రెండు వార్డుల్లో సర్వే చేయనున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు రెండేండ్లపాటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా తర్వాత ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహ, ఆయుర్వేద విధానంపై అవగాహన, వైద్యంపై వెచ్చిస్తున్న ఖర్చుకు సంబంధించిన వివరాలను కూడా ఈ సర్వేలో సేకరిస్తున్నారు. 

సమగ్రంగా వివరాల సేకరణ  

సర్వేలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవనశైలిని అధ్యయనం చేస్తున్నారు. వారికి ఏయే వనరుల నుంచి ఆదాయం వస్తోంది? ఖర్చు ఎలా చేస్తున్నారు? ఏం తింటున్నారు? పౌష్టికాహార లోపం, తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.  14 అంశాలకు సంబంధించిన అనేక వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబసభ్యుల సంఖ్య, పని, విద్యార్హతలు, ఆదాయం, వ్యయాలు, ఆరోగ్యం, విద్యపై పెట్టిన ఖర్చు, నీటి వసతులు, పారిశుద్ధ్యం, బ్యాంకు ఖాతాలు, ఇల్లు, ఫోన్‌‌, ఇంటర్నెట్‌‌ సౌలతులు, లింగ నిష్పత్తి, ఉపాధి అవకాశాలు, అయిదేళ్లలోపు పిల్లల వివరాలు, ప్రజా రవాణా వ్యవస్థ, హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ కోసం చేరిన వారి సంఖ్య, వైద్యానికి అయిన ఖర్చు ఇలా సమగ్ర వివరాలు సేకరించి అన్‌‌లైన్‌‌లో పొందుపరుస్తున్నారు.