బీజేపీలో పెరిగిన జోష్.. ఖమ్మంకు అమిత్ షా

బీజేపీలో పెరిగిన జోష్.. ఖమ్మంకు అమిత్ షా

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరికతో డీలా పడిన తెలంగాణ బీజేపీలో..ప్రధాని మోదీ  జోష్ నెలకొంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం దిశగా కార్యచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. జులై 29వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. 

జూన్ నెలలోనే  హోంశాఖ మంత్రి అమిత్ షా  తెలంగాణలో పర్యటించాలి. అయితే కొన్ని అనుకోని కార‌ణాలు, ప్రకృతి విప‌త్తుల వ‌ల‌న అమిత్ షా   టూర్ వాయిదా పడింది. అయితే జులై 29వ తేదీన  కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా తెలంగాణ‌కు రానున్నారు. ఖ‌మ్మంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేత‌లు స్పష్టం చేశారు. 

అయితే ఈ బ‌హిరంగ స‌భకు ముందే  తెలంగాణ‌లో క్షేత్రస్థాయిలో బీజేపీని మరిత బ‌లోపేతం చేయాల‌ని జాతీయ అధ్యక్షుడు నేతలను ఆదేశించారు.  జులై9వ తేదీన హైదరాబాద్ లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో భేటీ అయిన నడ్డా..తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని వీలైనంతగా ముందుకు తీసుకెళ్లాల‌ని నిర్ణయించారు. దీనికి తోడు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ‌వ్యాప్తంగా  170 లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.  దీనిపై కీల‌కంగా చ‌ర్చించారు. ఏయే అంశాల ప్రాతిప‌దిక‌న ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను కోల్పోయారో చ‌ర్చించారు.  బ‌లంగా ఉన్న చోట మ‌రింత బ‌ల‌ప‌డేందుకు, బ‌ల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లో బ‌లం పెంచుకునేందుకు కృషి చేయాల‌ని నేత‌ల‌కు జేపీ న‌డ్డా  ఆదేశాలు జారీ చేశారు.