విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి

విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి

ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో.. ఉద్యమాల్లో హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేదని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను విమర్నించారు. కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే..వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో..వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని..పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈ  సంవత్సరం హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.

పటేల్ చర్యతోనే విముక్తి..
కేంద్ర  హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు  విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించారని చెప్పారు.  జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని గుర్తు చేశారు.   సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి లభించదన్నారు.  109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. నిజాంసేన, రజాకార్లను తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని తెలిపారు .పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం తలవంచారని..13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. కొమురం భీం, రాంజీ గోండ్, చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులకు పటేల్ గౌరవ వందనం సమర్పించారన్నారు.  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ యోధులందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

నిజాం ఆగడాలు..
హైదరాబాద్‌ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని అమిత్ షా  వెల్లడించారు. నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆకృత్యాలు జరిగాయని అన్నారు.  నిజాం సైనికులు, రజాకార్లు గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు.