15న అమిత్ షా రాక.. ఖమ్మంలో బహిరంగ సభ.. ఖరారైన షెడ్యూల్

15న అమిత్ షా రాక.. ఖమ్మంలో బహిరంగ సభ.. ఖరారైన షెడ్యూల్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. దాదాపు 12 గంటల పాటు ఆయన పర్యటన సాగనుండగా, దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ ఆదివారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం (ఈ నెల 15) ఉదయం 11 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ కు రోడ్డు మార్గాన వెళతారు. అక్కడ 12.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్​లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 2.10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.

అనంతరం భద్రాద్రి రాములవారిని దర్శించుకుంటారు. భద్రాచలం నుంచి 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభ వేదికకు బయలుదేరతారు. సాయంత్రం 4.50 నుంచి 5.50 వరకు బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం 6.45 గంటలకు హెలికాప్టర్​లో తిరిగి శంషాబాద్​కు వస్తారు. రాత్రి 7 గంటలకు  శంషాబాద్ నోవాటెల్​కు చేరుకుంటారు. 7.30 నుంచి 8.30 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి బయలుదేరతారు.