28న రాష్ట్రానికి అమిత్ షా

28న రాష్ట్రానికి అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న అంశంపైనా ఆయన రివ్యూ చేసి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో రెండు రోజుల పాటు కార్యక్రమాలకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కనీసం రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టూర్ ఉండేలా చూస్తున్నారు. ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టాలని, ఇంకో నియోజకవర్గంలో రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని యోచిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత దీనిపై తుది నిర్ణయానికి రానున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. రెండో రోజు పర్యటనలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో గ్రూప్ ల వారీగా అమిత్ షాతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చెయ్యడంపైనా ఆలోచిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్ లుగా విభజించి.. ఆ క్లస్టర్ ల వారీగానే పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయడం ద్వారా ఇటు ఎంపీ సీట్లు, అటు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా గెలుచుకునే చాన్స్ ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలోనూ అమిత్ షా టూర్ తర్వాత క్లారిటీ రానుందని చెప్తున్నారు.