గాంధారి మైసమ్మకు ఘనమైన పూజలు..అంబరాన్నంటిన సంబురాలు

గాంధారి మైసమ్మకు ఘనమైన పూజలు..అంబరాన్నంటిన సంబురాలు
  • మూడో రోజు మొక్కులు చెల్లించుకున్న ఆదివాసీలు

కోల్​బెల్ట్, వెలుగు: ఆదివాసీ నాయక్​పోడ్ వంశీయుల ఆరాధ్య దైవం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో కొలువైన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర అంబరాన్నంటింది. ఆదివారం జాతర చివరిరోజున ఆదివాసీ గిరిజనులు, భక్తులు తరలివచ్చి మైసమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున నుంచే గాంధారి ఖిల్లాకు భక్తులు పోటెత్తారు. జాతర చివరి రోజు నిర్వహించిన దర్బార్​కు ఆఫీసర్లు హాజరయ్యారు. 

మైసమ్మ తల్లికి మొక్కులు

తెల్లవారుజామున మూడు గంటలకు ఖిల్లాలోని పెద్ద దర్వాజ వద్దనున్న గాంధారి మైసమ్మ తల్లికి ఆదివాసీ నాయక్​పోడ్​రొడ్డ వంశీయుల కులపెద్దలు ప్రత్యేకంగా పట్నాలు వేసి పూజలు చేశారు. మొదట బలి కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయక్​పోడ్ వంశీయులు, గిరిజన తెగల భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో 300 మీటర్ల ఎత్తున్న ఖిల్లాకు వెళ్లి మైసమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. జాతరలో ఆదివాసీలు తమ సంస్కృతీసంప్రదాయాలను చాటి చెప్పేలా ఆటపాటలతో రోజంతా అలరించారు. 

గాంధారీ వనం అర్బన్​పార్క్​ ప్రాంగణంలోని చిల్డ్రన్స్​ పార్క్​లో వందలాది కుటుంబాలు వనభోజనాలు చేశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన మైసమ్మ జాతర ఆదివారం రాత్రి ముగిసింది. గిరిజన భక్తులు తిరుగుపయాణమయ్యారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​నేతృత్వంలో మందమర్రి సీఐ పర్స రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.