స్పీడ్ పెంచిన బీజేపీ .. ఏప్రిల్ 23న తెలంగాణకు అమిత్ షా

స్పీడ్ పెంచిన బీజేపీ .. ఏప్రిల్ 23న తెలంగాణకు అమిత్ షా

తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల లేదా వికారాబాద్ లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సభ నిర్వహించే ప్రాంతం ఎంపిక, ఏర్పాట్లపై బీజేపీ నేతలు తలమునకలయ్యారు. అమిత్ షా పర్యటన తేదీ ఖరారుపై డిస్కషన్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్లో.. రంగారెడ్డి జిల్లా రూరల్ కు చెందిన బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో అమిత్ షా సభా ఎక్కడ నిర్వహించాలనే దానిపై వారంతా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ  సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా  ప్రచారం నడుస్తోంది.

బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం సాగుతోంది. కర్ణాటక ఎన్నికల తరువాత అమిత్ షా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెడతారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే.