మోడీ జన్మదిన వేడుకల్లో అమిత్ షా

మోడీ జన్మదిన వేడుకల్లో అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  మోడీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. అందరికీ విద్యుత్, ఉచిత సిలిండర్లు, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అమిత్ షా పంపిణీ చేశారు.  

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇన్నేళ్లుగా నిర్వహించలే

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇన్నేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు.  విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే.. వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో..వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈ  సంవత్సరం హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.