మేడిగడ్డ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్.. కాళేశ్వరంపై అనుమానాలున్నయ్​:​ కిషన్‌‌రెడ్డి

మేడిగడ్డ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్.. కాళేశ్వరంపై అనుమానాలున్నయ్​:​ కిషన్‌‌రెడ్డి
  • విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుత
  • ప్రజల సొమ్ము  దోచేందుకే ఈ ప్రాజెక్టు కట్టారు
  • బీజేపీ సీఈసీ మీటింగ్ తర్వాత రెండో లిస్ట్ రిలీజ్
  • జనసేనతో పొత్తుపై చర్చలు జరిపినం.. ఫైనల్ కాలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజ్ అట్టర్ ఫ్లాప్ అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో వరదలు వచ్చినపుడు మేడిగడ్డ మోటార్లు కొట్టుకుపోయాయని విమర్శించారు. “కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవటం బాధాకరం. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అందరికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ మార్వెల్, నేనే ఇంజనీర్, రీ డిజైనర్ అని కేసీఆర్ చెప్పుకున్నరు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక, డ్రీమ్ ప్రాజెక్టు అని బీఆర్ఎస్‌‌ నేతలు గొప్పలు చెప్పుకున్నరు. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి కుంగడంతో కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారు” అని ఎద్దేవా చేశారు. 

ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతానని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను పంపమని కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి డ్యామ్‌‌ అథారిటీ విచారణ చేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు.

150 టీఎంసీలు ఎత్తిపోసి.. కిందికి వదిలేశారు

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంపై అనుమానాలున్నాయని, సమగ్రమైన దర్యాప్తు జరపాలని కిషన్‌‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా అంచనాలు పెంచి నిధులు ఖర్చు చేశారు. దీని ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రకటించి, ఎందుకు ఇవ్వలేదు? అసలు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలి. 3 ఏళ్లకే ప్రాజెక్టు కుంగిపోవటం ఆశ్చర్యంగా ఉంది” అని కిషన్‌‌రెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారని కేసీఆర్‌‌‌‌పై ఫైర్ అయ్యారు. ఏటా 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రైతులకు అందిస్తానన్న కేసీఆర్.. గత ఐదేండ్లలో రైతులకు ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఐదేండ్లలో 150 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి.. వాటిని మళ్లీ కిందికి వదిలారని ఎద్దేవా చేశారు. వేల‌‌ కోట్ల ప్రజల సొమ్ము నీళ్ల పాలు అయిందని మండిపడ్డారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కవలపిల్లలు

బీజేపీ ఫస్ట్ లిస్టులో ఉన్న వారంతా బలమైన క్యాండిడేట్లేనని కిషన్‌‌రెడ్డి చెప్పారు. ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత రెండో లిస్టును ప్రకటించనున్నట్లు తెలిపారు. తాను పోటీ చేయకపోవడమనేది పార్టీ అంతర్గత విషయమని అన్నారు. ఇకపై ప్రచారం స్పీడును పెంచుతామని చెప్పారు. ఇప్పటికే పాలమూరు, నిజామాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనగా, అమిత్ షా మరో 3 సభల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ఈనెల 27న మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఈనెల 31న యూపీ సీఎం యోగి పర్యటిస్తున్నారని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని విమర్శించారు. బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పాలన, అవినీతిలో కవలపిల్లలు అని మండిపడ్డారు.

పొత్తులు ఇంకా ఫైనల్ కాలే

ఎన్నికల్లో పోటీపై జనసేనతో ప్రాథమికంగా చర్చలు జరిపామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పొత్తులు ఖరారు అయ్యాక అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. రాజాసింగ్‌‌పై సస్పెన్షన్ ఎత్తివేసినందుకు పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేత తర్వాత పార్టీ రాష్ర్ట కార్యాలయానికి రాజాసింగ్‌‌ రాగా.. ఆయనకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాజెక్టులో ఎన్నో లోపాలు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాళేశ్వరం గురించి ఎంతో ఊహించుకున్నామని, డీపీఆర్ ప్రకారం నిర్మిస్తే చాలా ఉపయోగపడేదని, కానీ కేసీఆర్ రీ డిజైన్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. వరల్డ్ గ్రేటెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ గా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కరెంట్ బిల్లులు ఎక్కువయ్యాయని, ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో బ్యాంకుకు ఒక్కో డీపీఆర్ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, కాళేశ్వరంపై ఆర్టీఐ అర్జీ పెడితే.. కనీసం సమాచారం ఇవ్వడంలేదని మండిపడ్డారు.

కిషన్ రెడ్డిని కలిసిన అసంతృప్తులు

బీజేపీ మొదటి లిస్టులో చోటు దక్కని నేతలు కిషన్ రెడ్డిని కలిశారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌‌వీఎస్ఎస్ ప్రభాకర్, పటాన్ చెరు టికెట్ ఆశించిన శ్రీకాంత్ గౌడ్, గోషామహల్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్.. కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు జగిత్యాల జిల్లాకు చెందిన సంకు సుధాకర్, పద్మశాలి సంఘం జాతీయ నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.