- కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్ : సంజయ్
- బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, వెలుగు : అతి త్వరలోనే కాంగ్రెస్ లో.. బీఆర్ఎస్ విలీనం తథ్యమని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, హరీశ్ రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సంజయ్ ఖండించారు. కవితకు బెయిల్ ఇవ్వాలా.. వద్దా?
అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని సంజయ్ ప్రశ్నించారు. సీఎం పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ధి కోసం న్యాయస్థానంపై బురదచల్లడం దుర్మార్గమైన చర్య అన్నారు.
బీఆర్ఎస్ది ముగిసిన చాప్టర్
బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన చాప్టర్అని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందని, పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని వెల్లడించారు. గతంలోనూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతోపాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉందని గుర్తుచేశారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ సహా అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యంమని
నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ లను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలని, లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
