ఆన్‌‌లైన్‌‌ మోసాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి : బండి సంజయ్‌‌

ఆన్‌‌లైన్‌‌ మోసాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి : బండి సంజయ్‌‌
  • సీఐఎస్‌‌ సమీక్షలో అధికారులకు బండి సంజయ్‌‌ ఆదేశాలు

న్యూఢిల్లీ, వెలుగు: మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్‌‌లైన్‌‌ మోసాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌ ఆదేశించారు. సైబర్‌‌ మోసాలపై స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నార్త్‌‌ బ్లాక్‌‌లోని తన కార్యాలయంలో సైబర్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ సెక్యూరిటీ డివిజన్‌‌ (సీఐఎస్‌‌) పనితీరును ఆయన సమీక్షించారు.

సైబర్‌‌ మోసాల నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. సైబర్‌‌ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేలా రూల్స్​ను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఇండియన్‌‌ సైబర్‌‌ క్రైమ్‌‌ కోఆర్డినేషన్‌‌ సెంటర్‌‌ (ఐ4ఇ) ప్రాధాన్యతపై చర్చించారు. సైబర్‌‌ పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.