చౌక ధరకే మెడిసిన్...ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

చౌక ధరకే మెడిసిన్...ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

కరీంనగర్ సిటీ, వెలుగు : రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  చెప్పారు. కరీంనగర్  ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే   మందులను వినియోగించుకోవాలని కోరారు. 

శనివారం  ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో ప్రధానమంత్రి జన ఔషధి  కేంద్రాన్ని అయన ప్రారంభించి మాట్లాడారు.  పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెచ్చిందన్నారు.  మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

ప్రజల బాధలు, ఆర్థిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

అంజన్న సన్నిధిలో   బండి సంజయ్ ... 

కొండగట్టు :  కొండగట్టు అంజన్న సన్నిధిలో కేంద్రమంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, కార్పోరేటర్ లతో కలిసి కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, స్థానాచార్యులు కపిందర్ తదితరులు పాల్గొన్నారు