హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ఆస్తులను దోచుకునేందుకే ఆయన భార్య మాగంటి సునీతకు బీఆర్ఎస్టికెట్ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎంత ఖర్చయినా పెట్టి, ఎమ్మెల్యేగా గెలిపించాక.. గోపీనాథ్ ఆస్తులను తీసుకునేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర చేశారన్నారు.
ఆదివారం యూసుఫ్‌గూడలో మీడియాతో ఆయన మాట్లాడారు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పినా, ఆయన తల్లి జూన్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గోపీనాథ్ కొడుకును తెలంగాణకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించారని ఆరోపించారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలతో ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని, ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని చెప్పారు.
సునీత ఓటర్ కార్డుల్లో ఒకదానిపై భర్త పేరు మనోహర్ అని, మరొకటి మాగంటి గోపీనాథ్ అని ఉందన్నారు. ఎన్నికల అఫిడవిట్లలో చదువు వివరాలు కూడా మారాయన్నారు. గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కుట్ర చేస్తున్నారని, అందుకే ఆయన మృతిపై దర్యాప్తు చేయడం లేదన్నారు. గోపీనాథ్ ఏఐజీ దవాఖానలో చికిత్స తీసుకుంటూ ఉంటే.. ఆయన తల్లిని కేటీఆర్రానీయకుండా చేశారని అన్నారు.
కేటీఆర్ దంపతులు అక్కడే తిష్ట వేసి, ఆస్తులను పంచుకునే కుట్ర చేశారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని తల్లి, భార్య, బిడ్డతో వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా? అని కేటీఆర్ కు సవాల్ విసిరారు.
