
- కరీంనగర్లో రాజకీయాలు చేయను
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కోహెడ, (హుస్నాబాద్), వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు చేయబోనని, అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పని చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, సైకిల్ కూడా ఉండేది కాదన్నారు. ఆ బాధ పేద స్టూడెంట్స్ పడకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్‌కు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
వివిధ సంస్థల సహకారంతో సీఎస్సార్ నిధులను సేకరించి సైకిళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకు జీవించవచ్చన్నారు. పదేండ్లలో విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ,8 లక్షల కోట్లను వెచ్చించిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని, ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ లేకుండా చేయడం మంచి కార్యక్రమమన్నారు. హుస్నాబాద్ కు నవోదయ స్కూల్ మంజూరు చేయాలని ఇద్దరం కలిసి కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.సైనిక్ స్కూల్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీకి వరుసగా ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షన్ లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఉన్నారు.