రాజ్యాంగంపై కేసీఆర్ కు గౌరవం లేదు

రాజ్యాంగంపై కేసీఆర్ కు గౌరవం లేదు

హైదరాబాద్/ ఓయూ/ గచ్చిబౌలి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోకపోవటంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్​లోని ఇఫ్లూలో ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక రాజకీయ స్నేహితుడిగా ఆయన ఎవరికి స్వాగతం పలుకుతారు అనేది నాకు ముఖ్యం కాదు. అది ఆయన సమస్య. కానీ, తాను ఒక ముఖ్యమంత్రి అని కేసీఆర్ మర్చిపోకూడదు. దేశానికి ప్రధాన మంత్రిగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మోడీ. కాబట్టి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఏ సీఎం అయినా ప్రధానికి స్వాగతం పలకడం మర్యాద. సోమవారం ఉదయం  ఏపీ ముఖ్యమంత్రి.. మోడీకి ఆహ్వానం పలికినట్లుగా.. రాజ్యాంగబద్ధతపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గౌరవమే లేదు. ఆయన తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించలేదు. ఇది దురదృష్టకరం’’ అని ధర్మేంద్ర ఫైర్​ అయ్యారు.

నాలెడ్జ్​ సొసైటీకి ఎన్​ఈపీ కీలకం

దేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చేందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కీలకమని కేంద్ర మంత్రి అన్నారు.  సోమవారం ఇఫ్లూ క్యాంపస్​లో యాంఫీ థియేటర్, మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ -కమ్ -ఆడిటోరియంను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం–2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో ప్రాంతీయ, మాతృ భాషలకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయన్నారు. హిందీ, బెంగాలీ, తెలుగు భాషలను ఒకే గొడుగు కిందకు తేనున్నట్టు తెలిపారు. చైనా, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్​ భాషలను ఆన్​లైన్లో ఫ్రీగా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఎన్​ఈపీ–2020 అమల్లో ఇఫ్లూ ముందంజలో ఉండటంతో వీసీ సురేశ్​ కుమార్​ను కేంద్ర మంత్రి అభినందించారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విద్యకు బడ్జెట్​లో నిధులు పెంచారన్నారు. వర్సిటీల్లో చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఫెలోషిప్స్​ ఇవ్వాలని టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్​ కేంద్ర మంత్రి ధర్మేంద్ర వినతి పత్రం అందజేశారు. అనంతరం గచ్చిబౌలిలోని హెచ్​సీయూలో పలు నిర్మాణాలను ధర్మేంద్ర ప్రదాన్​ ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంచాలని సూచించారు.