తెలంగాణ సంస్కృతికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది

తెలంగాణ సంస్కృతికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది

హైదరాబాద్: బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాధారణంగా  దేవున్ని పూజించడానికి పూలను వాడుతామని, అలాంటి పూలను పూజించే పండుగ బతుకమ్మ అని అన్నారు. అలాంటి సద్దుల బతుకమ్మ  కోసం చిన్నప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక ఇండియా గేట్ వద్ద  కేంద్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ కార్యక్రమానికి  తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కూడా దేశవ్యాప్తంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. 

కేశవ్ మెమోరియల్ ‘సాంస్కృతిక భారత్’  వేడుకల్లో కిషన్ రెడ్డి

ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని మతాలున్నా భారతదేశమంతా ఒక్కటేనని.. భారతీయులంతా ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  సంస్కృతులు, వేషభాషలు వేరైనా మనమంతా ఒక్కటేనని చెప్పారు.  దీన్ దయాల్ ఉపాధ్యాయ, లాల్ బహదూర్ శాస్త్రి,  గాంధీజీ వంటి మహోన్నతుల జయంతి దినోత్సవాలన్నీ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 మధ్యే ఉన్నాయని.. ప్రధాని మోడీ పిలుపుమేరకు ఈ 15 రోజులు దేశవ్యాప్తంగా ‘సేవా పఖ్వాడా’ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, టీకాలు వేయడం, స్వచ్ఛ భారత్ వంటి అనే కార్యక్రమాలు చేస్తు్న్నారని చెప్పారు. ‘సేవా పఖ్వాడా’లో భాగంగా హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ లో నిర్వహించిన ‘సాంస్కృతిక భారత్’  కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడారు. పండుగ వాతావరణంలో  ‘సాంస్కృతిక భారత్’  కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.