
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీములో చేరాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. పేదలకు లబ్ధి చేకూర్చే ఈ పథకం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అమలవుతోందని, తెలంగాణలోనూ ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు రాశామన్నారు. కేసీఆర్ గురించి తనకు బాగా తెలుసని, ఆయన లవ్లీ పర్సన్ అని, ఐ లవ్ హిమ్ అంటూ కితాబిచ్చారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలోనూ అమలు చేస్తారని నమ్ముతున్నానన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 32 లక్షల మంది లబ్ధి పొందారని, 16 వేల హాస్పిటళ్లు ఎంప్యానెల్ అయ్యాయని చెప్పారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2022 నాటికి సరికొత్త భారత్‌ను చూడడం ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్, ఐఐసీటీ, సీసీఎంబీ సంస్థల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) సెంటర్‌లో ఎన్‌జీఎస్(నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్) ల్యాబ్, ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. సీవీ రామన్, జగదీశ్ చంద్రబోస్ వంటి వారు సౌకర్యాలేమీ లేకున్నా గొప్ప ఆవిష్కరణలు చేశారని, వాళ్ల కాలంతో పోల్చితే ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని యువ సైంటిస్టులు కొత్త ఆవిష్కరణలకు ఊపిరిపోయాలన్నారు. మానవ జన్యువులను వేగంగా విశ్లేషించేందుకు ఎన్‌జీఎస్ తోడ్పడుతుందని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో ఒక్క రోజులోనే 30 మంది జన్యువులను విశ్లేషించొచ్చని సైంటిస్టులు చెప్పారు. 8 నిమిషాల్లో 80 వేల కణాల అమరికను విశ్లేషించవచ్చని, కేన్సర్ వంటి కణ సంబంధిత రోగాలపై లోతుగా పరిశోధనలు చేయొచ్చన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తీసుకొస్తున్నామని, ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు.