న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎరువుల లభ్యతపై తలెత్తిన సందేహాలకు శుక్రవారం లోక్‌సభలో ఆయన సమాధానమిచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉన్నప్పటికీ తగిన వ్యూహాలను సిద్ధం చేశామన్నారు. ఎరువుల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా కొత్త మార్కెట్లు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు.
