తెలంగాణలో ఎంఐఎస్‌‌‌‌ గైడ్ లైన్స్​కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ : మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

తెలంగాణలో ఎంఐఎస్‌‌‌‌ గైడ్ లైన్స్​కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ : మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి
  • మిర్చి రైతులకు లబ్ధి చేకూరుతుందన్న కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఇంటర్‌‌‌‌ వెన్స్‌‌‌‌న్‌‌‌‌ (ఎంఐఎస్‌‌‌‌) స్కీంలోని ప్రైజ్‌‌‌‌ డెఫిషియెన్సీ పేమెంట్‌‌‌‌ (పీడీపీ) అమలుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మిర్చి రైతులకు లబ్ది చేకూరుతుందని గురువారం రిలీజ్​చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఐఎస్‌‌‌‌ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఈ స్కీంను తెలంగాణలో అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని మిర్చి రైతులకు ఎలాంటి నష్టం చేకూరకుండా చర్యలు తీసుకోవాలని 4 ఏప్రిల్, 2025 కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌కు లేఖ ద్వారా కోరినట్లు కిషన్‌‌‌‌ రెడ్డి గుర్తు చేశారు.

మిర్చి రైతులకు బహిరంగ మార్కెట్‌‌‌‌లో సాగుధర కన్నా తక్కువ ధర వస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అందువల్ల మిర్చి రైతులను ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ స్పందిస్తూ.. 2024–25 ఫైనాన్షియల్ ఈయర్ లో ఈ స్కీం కింద తెలంగాణలో ఉత్పత్తి అయిన మిర్చి పంటలో 1,72,135 మెట్రిక్‌‌‌‌ టన్నుల పంటకు (తెలంగాణలో ఉత్పత్తి అయ్యే మొత్తం 6,88,540 మెట్రిక్‌‌‌‌ టన్నుల మిర్చి పంటలో 25 శాతం) ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించిందన్నారు. మార్కెట్‌‌‌‌ ఇంటర్వెన్షన్‌‌‌‌ స్కీం కింద మార్కెట్‌‌‌‌ ధరకు, సాగు ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు చెల్లిస్తామని వెల్లడించిందన్నారు.

 మిర్చి పంటకు ఎంఐఎస్‌‌‌‌ ధరను క్వింటాల్‌‌‌‌కు రూ.10,374 గా నిర్ధారించింది. ఎంఐఎస్‌‌‌‌కు, మార్చెట్‌‌‌‌ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. కొన్నిచోట్ల దళారులు, క్వింటాలు మిర్చీని రూ.5–6 వేలకే కొనుగోలు చేస్తూ.. రైతులను మోసం చేస్తున్న ఘటనలు దృష్టికి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి రైతులకు జరుగుతున్న నష్టంపై దృష్టి సారించాలని కిషన్‌‌‌‌రెడ్డి ప్రకటనలో కోరారు.