- ఆపరేషన్ పోలోతో మనకు నిజమైన స్వేచ్ఛ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- సికింద్రాబాద్‌లో ఘనంగా పటేల్ 150వ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నలభై లక్షల మంది కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజలు తమ హృదయాల్లో నిలుపుకోవలసిన మొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘సర్దార్@150 యూనిటీ మార్చ్’ లో కిషన్ రెడ్డి హాజయ్యారు.
ఈ సందర్భంగా సీతాఫల్మండి శివాజీ విగ్రహం నుంచి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ తెలంగాణలో రజాకార్లు సాగించిన హత్యాకాండ, వేధింపుల నుంచి మనల్ని విముక్తి చేసింది పటేల్ అని కొనియాడారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి, తెలంగాణకు నిజమైన స్వేచ్ఛను ప్రసాదించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా వందల సంస్థానాలను ఏకం చేసి దేశాన్ని ఒక్కటిగా నిలిపిన పటేల్ గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
అఖండ భారత్ నిర్మాత పటేల్: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణ ప్రాంతంతో సర్దార్ పటేల్ కు విడదీయరాని అనుబంధం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. నిజాం సర్కారు దమనకాండ నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి ఆయన ‘పోలీస్ యాక్షన్’ చేపట్టారన్నారు. హైదరాబాద్ సంస్థాన్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 560 సంస్థానాలను ఏకం చేసి ‘అఖండ భారత్’ను నిర్మించిన మహానాయకుడు అని కొనియాడారు. కార్యక్రమంలో సినీనటి ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు.
