చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేస్తం .. కిషన్ రెడ్డి

చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేస్తం ..  కిషన్ రెడ్డి
  • ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద లేజర్ లైట్ షో ప్రారంభం

ఓయూ,వెలుగు: చారిత్రక కట్టడాలను పరిరక్షించాలనే లక్ష్యంతోనే   కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రూ.15కోట్లతో  ఓయూ ఆర్ట్స్​ కాలేజీ వద్ద లేజర్ లైట్ షోను ఏర్పాటు చేశామని చెప్పారు. వందేమాతరం ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ చరిత్రను లైట్ షో ద్వారా వివరిస్తూ ఔన్నత్యాన్ని పెంపొందించనున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కు ఎవరొచ్చినా ఓయూ ఆర్ట్స్ కాలేజీ చూడకుండా ఉండలేరని గుర్తుచేశారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులతో  ఆర్ట్స్ కాలేజీకి రూ. 12 కోట్లతో ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టంను కేంద్రమంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య తగ్గిందని, మళ్లీ ఆకర్షించేందుకు చారిత్రక కట్టడాలు,  పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్ ద్వారా వర్సిటీ చరిత్ర, ఇక్కడ చదివిన ప్రముఖుల వివరాలు, గోరటి వెంకన్న పాటలతో వీడియోలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవమైన ఈనెల 27న వాటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. త్వరలో వర్సిటీలో కేంద్రప్రభుత్వ నిధులతో రెండు హాస్టళ్లను నిర్మిస్తామన్నారు.

రూ.7.5 కోట్లతో బాలుర హాస్టల్, రూ.7.5 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మిస్తామని చెప్పారు.  సంగీత నాటక అకాడమీకి దక్షిణభారత్ లో ఎలాంటి శాఖ లేదని, హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఏవీఎన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్​ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, వీసీ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 ఫ్లెక్సీలు చించిన బీఆర్ఎస్వీ నేతలు  

ఓయూ ఆర్ట్స్​ కాలేజీ బిల్డింగ్​కు ఏర్పాటు చేసిన డైనమిక్​ లైటింగ్​ సిస్టమ్​ ప్రారంభ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రాక సందర్భంగా సికింద్రాబాద్​కు చెందిన పలువురు బీజేపీ నేతలు ఆర్ట్స్​కాలేజీ ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమంలో పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమేంటని  నిరసిస్తూ పలువురు బీఆర్ఎస్వీ​ స్టూడెంట్లు వాటిని చించివేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. నూతనజాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని,  అధ్యాపకపోస్టుల భర్తీ చేయాలంటూ ఆందోళనకు దిగిన  స్టూడెంట్లను  పోలీసులు అరెస్టు చేశారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు

ఘట్ కేసర్ : ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం అవుషాపూర్ పీపీఆర్ గార్డెన్​లో జరిగిన బీజేవైఎం మండల అధ్యక్షులు, నేతలు సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.  రాష్ట్రం కేసీఆర్ కబంద హస్తాల్లో చిక్కుకుందని, కుటుంబపాలనతో ప్రజలు విలవిల్లాడుతన్నారని విమర్శించారు. బీజేవైఎంతోనే దేశానికి బలమైన నాయకత్వం లభిస్తుందని.  యువజన సమస్యలపై పోరాటం చేసేది బీజేవైఎం అని పేర్కొన్నారు.