తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపింది: కిషన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపింది:  కిషన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  కేంద్రప్రభుత్వం తరుపున గోల్కొండ కోటలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా  గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి  తెలిపారు. 12 వందల మంది  ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని చెప్పిన కిషన్ రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు. బీజేపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిచిందని, రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

తాము తెలంగాణ ఏర్పాటు కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతుంటే.. తమపై కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేయించిందని ఆరోపించారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవం  కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటిసారి అన్ని రాష్ట్రాల రాజ్ భవన్ లలో తెలంగాణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.   గత ఏడాది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు కిషన్ రెడ్డి   కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి  పూర్తిగా సహకారం అందిస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.  కాగా  గోల్కొండ కోటలో 2023 జూన్ 02 శుక్రవారం జరగనున్న  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు కిషన్ రెడ్డి. అనంతరం కేంద్ర బలగాల కవాతుకు గౌరవ వందనం చేయనున్నారు.