పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద ఫ్యాక్టరీ : కిషన్ రెడ్డి

పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద ఫ్యాక్టరీ : కిషన్ రెడ్డి
  • ఆపరేషన్ సిందూర్​తో ఇండియన్​ ఆర్మీ లక్ష్యం నెరవేరింది

హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద ఫ్యాక్టరీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ తో భారత సైనికులు చూపించిన అద్భుత వ్యూహాన్ని అన్ని దేశాలు అభినందించాయని గుర్తుచేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి సవాలుగా నిలిచిందని అన్నారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. భారతసైన్యం ఉగ్రవాదుల ఇండ్లు, శిబిరాలు, స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేసిందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సమగ్ర విధానంతో, భారత సైనికులు తమ శక్తి సామర్థ్యాలతో కొత్త చరిత్రను సృష్టించారని అభినందించారు. 

పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో మన ఎయిర్ బేసులపై దాడి చేసి విమానాలను కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తిగా ఆగిపోలేదని స్పష్టం చేశారు. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడి.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి రాఫెల్ ఫైటర్ జెట్లు, బ్రహ్మోస్ క్షిపణులను సమకూర్చిందని తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న తిరంగా యాత్రలో అందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ఎస్ కుమార్, ప్రకాశ్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

అహల్య బాయి సేవలు మరువలేనివి

భారతీయ సమాజంలో అహల్య బాయి హోల్కర్ కు ప్రత్యేక చరిత్ర ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఆమె జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  అహల్య బాయి హోల్కర్ 300 వ జయంతికి సంబంధించి  నిర్వహించిన వర్క్ షాప్ కు కిషన్ రెడ్డితో పాటు జాతీయ సహా సంఘటన మంత్రి శివ ప్రకాష్, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

మంత్రులపై విచారణ చేయించాలి

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు.మంత్రులు కమీషన్లు  తీసుకోవడం కామన్ అని కొండా సురేఖ అనడం బాధాకరమన్నారు. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అయితే, ఏ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తు చేయించాలని  సీఎం రేవంత్ రెడ్డిని కిషన్​రెడ్డి డిమాండ్ చేశారు.