ఎమ్మెల్యే దానం జనానికి ముఖం చూపించట్లే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎమ్మెల్యే దానం జనానికి ముఖం చూపించట్లే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ నాలుగేండ్లుగా జనానికి ముఖం చూపించటం లేదని, ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.  ఆదివారం ఫిల్మ్ నగర్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. కిషన్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల టైంలో కారు గుర్తుకు ఓటేస్తే.. డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

9 ఏండ్లుగా ఇండ్ల  పేరుతో జనాన్ని ఊరిస్తుండని,  పొదుపు సంఘాల మహిళలను  పట్టించుకోలేదని , ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. మోడీ బొమ్మ రేషన్ కార్డ్ మీద పెట్టాల్సి వస్తుందనే కొత్త రేషన్ కార్డు లు  ఇవ్వడంలేదన్నారు. పీఎం అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా కేంద్రం 4 కోట్ల ఇండ్లు  నిర్మిస్తే.. ఇక్కడ 9 ఏళ్లలో లక్ష ఇండ్లు నిర్మించారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే తెలంగాణలో అమలు చేయటం లేదన్నారు. ప్రజల కోసం మోడీ ఆలోచిస్తే..కొడుకు, కూతురు, అల్లుడి కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.