ముస్లింలతో కూడిన BC రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ ఒప్పుకోదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముస్లింలతో కూడిన BC రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ ఒప్పుకోదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుందని..  ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని బుధవారం (ఆగస్ట్ 6) ఢిల్లీలో టీపీసీసీ చేపట్టిన మహాధర్నాపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఆ హామీని నేరవేర్చాల్సిన బాధ్యత వాళ్లదే. చిత్తశుద్ధితో పని చేయాలి తప్ప.. బట్ట కాల్చి బీజేపీ మీద వేస్తామంటే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అశాస్త్రీయ కుల గణన సర్వే చేసి బీసీల సంఖ్యను తగ్గించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలను చేర్చి బీసీలను మోగిస్తున్నారని ఆరోపించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే.. బీసీలకు రాజ్యాధికారం కష్టమేనని అన్నారు. 

బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పునే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సభ గాంధీ కుటుంబాన్ని పొగిడేందుకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ఒత్తిడి తట్టుకునేందుకు గాంధీ కుటుంబ అనుగ్రహం పొందే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50 శాతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జపానికే సరిపోయిందని సెటైర్ వేశారు.