
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కౌలు రైతులను, నిరుద్యోగులను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన నలుగురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు, ఐదుగురు మాజీ జడ్పీటీసీలు, నలుగురు మాజీ ఎంపీపీలు, పది మంది ఎంపీటీసీలు, పది మంది సర్పంచ్ లతో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్యాగాలతో సాధించిన తెలంగాణ.. కేసీఆర్ కుటుంబానికి పదవులు ఇవ్వడం కోసమా.. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమా.. అని ప్రశ్నించారు. భైంసాలో మజ్లిస్ గుండాలు అరాచకం చేస్తున్నారు. భైంసాలో భయపడుతూ పండుగలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. పదేండ్లలో ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం కేసీఆర్ దేనని ధ్వజమెత్తారు. 70 శాతం పూర్తయిన ప్రాణహిత.. చెవెళ్ల ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి కమిషన్ ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోయాయి.. ఈ పాపం ఎవరిదని ప్రశ్నించారు. లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు.
దేశంలో ఎరువుల కొరత లేకుండా చేసిన ఘనత మోదీ సర్కార్ దేనని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటించి రైతు పక్షపాతిగా పేరు సంపాదించారన్నారు. బీజేపీ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం... ప్రజలు మోదీ న్యాయకత్వానికి అండగా ఉండాలని, తెలంగాణ లో బీజేపీని ప్రజలు ఆశీర్వదించేందుకు అండగా నిలవాలని కోరారు. మరోవైపు దేశ సంస్కృతి, నాగరికత, హిందువులను, నిర్లక్ష్యం చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ట్విట్టర్లో కిషన్రెడ్డి ఆరోపించారు. సనాతన ధర్మ వ్యతిరేక భాగస్వాములైన తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ కాంగ్రెస్ లో భాగస్వామ్య పార్టీ అని విమర్శించారు.