సర్వాయి పాపన్న గౌడ్ అంటే రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ : కిషన్ రెడ్డి

సర్వాయి పాపన్న గౌడ్ అంటే రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ : కిషన్ రెడ్డి

బహుజన ఇతయా..బహుజన సుకాయ నినాదాన్ని..సీఎం కేసీఆర్ కుటుంబ ఇతయా, బంధుమిత్ర సుకాయగా మార్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాపన్నగౌడ్ చరిత్రను ఈ తరానికి అందించాలనే ఉద్ధేశ్యంతో పోస్టల్ కవర్ ను విడుదల చేశామని తెలిపారు. అడిగిన వెంటనే అంగీకరించిన ప్రధానికి మోడీకి ఆయన  ధన్యవాదాలు తెలిపారు.

రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ అంటే సర్వాయి పాపన్న గౌడ్ అని కిషన్ రెడ్డి కొనియాడారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాటం చేశారని.. ప్రస్తుతం ఆయన చరిత్ర మరుగున పడిందన్నారు. భవిష్యత్ తరాలకు మహనీయుల చరిత్రను అందిస్తామని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.  గోల్కొండ కోటలో 10 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్న కేంద్రమంత్రి.. భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

సర్వాయి  పాపన్న గౌడ్ను పాలకులు విస్మరించారు : లక్ష్మణ్

సర్వాయి  పాపన్న గౌడ్ను పాలకులు విస్మరించారని.. చరిత్ర వారిని క్షమించదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చుతామన్నారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది చరిత్రలను మరుగున పడేశారని ఆరోపించారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్న లక్ష్మణ్.. విముక్తి కలిగించాల్సిన సమయం వచ్చిందన్నారు. గౌడన్నలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓబీసీలకు ప్రధాని మోడీ తన కేబినెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.