సింగరేణికి నష్టం రానివ్వం.. తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి నష్టం రానివ్వం..  తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్:  సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా  చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో బొగ్గుగనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన అంశాలను పరిశీలిస్తామని, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం రాకుండా చూస్తానని అన్నారు. ఆదాయం కోసమే బొగ్గుగనుల వేలం వేయడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టామని కిషన్ రెడ్డి చెప్పారు. 

ఒడిశాలోని నైని బ్లాక్ లో సింగరేణి కి లాభం వచ్చే విధంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని అన్నారు. దీనిపై త్వరలోనే ఒడిస్సా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి కాలరీస్ లో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని చెప్పారు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత కేంద్రంపైనా ఉందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. 

కమర్షియల్ మైన్ యాక్షన్  పారదర్శకంగా జరుగుతుందని, బిడ్డర్స్ కు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. పదేండ్ల  క్రితం  పరిశ్రమలకు పవర్ హాలీడే ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, కొత్త పాలసీ వల్ల నిరంతరం విద్యుత్  సరఫరా అవుతోందని చెప్పారు.