- అవసరమైతే మరిన్ని ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి
- అధైర్య పడొద్దని ఖమ్మం వరద బాధితులకు కేంద్ర మంత్రి భరోసా
- నిత్యావసరాల పంపిణీ.. ఖమ్మంలో పర్యటన
ఖమ్మం టౌన్/కూసుమంచి, వెలుగు: విపత్తు సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్రం రూ.1,345 కోట్ల నిధి ఉంచిందని, ఆ నిధులు ఖర్చు చేసిన తర్వాత అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. మున్నేరు వరద ఉధృతికి ఇండ్లు కోల్పోయి, వస్తువులు కొట్టుకుపోయి నిరాశ్రయులైన బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవ్వరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఆదివారం మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఖమ్మం కార్పొరేషన్ పరిధి దంసాలపురం కాలనీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, అధికారులతో కలిసి కిషన్‌రెడ్డి పర్యటించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. మున్నేరు వరదను అడ్డుకునేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని స్థానికులు కేంద్రమంత్రిని కోరాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం కందగట్ల ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో 8 వందల మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి, వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో పొంగులేటితో కలిసి కిషన్‌రెడ్డి పర్యటించారు. ఆకేరు వరదలో కొట్టుకుపోయిన పంటలు, ఊళ్లో కూలిన ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వడం హర్షణీయమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసి, రిపోర్ట్ పంపించేలా చూడాలని కిషన్ రెడ్డి సెక్రటరీని ఆదేశించారని చెప్పారు.