
- రేపు జరిగే తిరంగా యాత్రలో ప్రజలు పాల్గొనాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తికాలేదని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ పోరాటం పాకిస్థాన్ ఆర్మీపై కాదని, ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో దేశంలో ఉగ్రవాద ఘటనలు, కార్యకలాపాలు చాలా జరిగాయన్నారు.
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు, దిల్‌సుఖ్‌నగర్ లో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తుచేశారు. గత పదేండ్లుగా భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, ఐఎస్ఐ నెట్‌వర్క్‌ను అంతం చేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్ లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు. దేశరక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా ఈనెల 17న హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో నిర్వహించే తిరంగా ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఆయన కోరారు.
ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారని రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘అతిథి దేవోభవ’ మన విధానమని, అయితే.. అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.