రాష్ట్ర బీజేపీపై అధిష్టానం ఫోకస్.. హుటాహుటీన ఢిల్లీకి కిషన్ రెడ్డి

 రాష్ట్ర బీజేపీపై అధిష్టానం ఫోకస్.. హుటాహుటీన ఢిల్లీకి కిషన్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీని మరింత బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించింది. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి పిలుపు అందింది. బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతో కిషన్ రెడ్డి హుటాహుటీన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హస్తినకు వెళ్లారు. ఢిల్లీలో ఈటల రాజేందర్,  రాజగోపాల్ రెడ్డితో నిర్వహించనున్న  భేటీలో కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. 

కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలో.. వీరిని ఢిల్లీకి రావాలని ఆదేశించింది హైకమాండ్. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీళ్లిద్దరితో పాటు సీనియర్లను పిలుపించుకుని మాట్లాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటనే ఢిల్లీ రావాలని ఆదేశించింది పార్టీ హైకమాండ్. దీంతో ఆయన జూన్ 24వ తేదీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.