న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్‌లో తాము ఎప్పుడూ ఒక్క కార్పొరేటర్ సీటు కూడా గెలవలేదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ స్థానం బీజేపీకి బలహీనమైందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చాయన్నారు. అయినప్పటికీ ఉన్నంతలో గెలుపు కోసం ప్రయత్నం చేశామని, ఓటమిపై ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని వెల్లడించారు.
ఓటమిని విశ్లేషించుకుంటామని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి స్పందించారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ఆ పార్టీ సహకరించడం వల్లే వారు గెలిచారు తప్పా.. సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేశాడని ప్రజలు ఆయనకు ఓటేస్తారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రూ. కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉందని, ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదన్నారు. దీనిపై ఈసీఐకి కంప్లైంట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలు శాశ్వతం కాదని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచిన బీజేపీ.. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 57 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సాధించిందని గుర్తుచేశారు.
దేశంలో కాంగ్రెస్ పనైపోయింది..
దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు. ఓటు చోరీపై ఆ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వానికి బిహార్ ప్రజలు పట్టడం కట్టారన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ... తాము సైతం ఊహించనంత భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) జరగాలన్నారు. ఓటు చోరీ, ఈవీఎంల హైజాక్ పేరుతో ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. బిహార్‌లో ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సంస్థలు, ఈవీఎంలను విమర్శించిన రాహుల్.. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయంపై ఏం చెబుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
