అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి : కేంద్ర మంత్రి కుమారస్వామి

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి : కేంద్ర మంత్రి కుమారస్వామి

అలంపూర్, వెలుగు: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్​డీ కుమారస్వామి అన్నారు. ఆదివారం మంత్రి దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఆలయాలను సందర్శించారు. అలంపూర్‌‌‌‌లోని హరిత హోటల్ వద్ద గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు మంత్రిని శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్​కు చేరుకున్నారు.

అర్చకులు పూర్ణకుంభంతో వెల్కమ్​ చెప్పారు. మంత్రి దంపతులు వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ టెంపుల్​లో కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జోగులాంబ అమ్మవారి అనుగ్రహంతో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, ఆలయ ఈవో దీప్తి, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.