రాష్ట్రంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నం: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే

రాష్ట్రంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నం: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే
  • శంషాబాద్–బెంగళూరు హైవే విస్తరణకు రూ.9 వేల కోట్లు ఇచ్చినం
  • కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే
  • తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కారు 
  • ప్రజలకు తెలియనివ్వడం లేదని మండిపాటు

షాద్ నగర్, వెలుగు : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. అయితే, తమ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు తెలియనివ్వడం లేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఆయన శనివారం పర్యటించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్  రెడ్డి, స్థానిక నియోజకవర్గ ఇన్ చార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి.విజయ్ కుమార్ తదితరులతో కలిసి నియోజకవర్గంలోని కొత్తూరు మండలం ఎస్బీ పల్లిలో జాతీయ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మంజూరైన రోడ్లను ఆయన పరిశీలించారు.

అనంతరం షాద్ నగర్  నియోజకవర్గంలో డాక్టర్ టి.విజయ్ కుమార్ ఇంట్లో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఎస్బీ పల్లి, కేశంపేట, ఆమనగల్, జహంగీర్  పీర్  దర్గా తదితర రోడ్లను కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేసిందన్నారు. గత మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘శంషాబాద్  నుంచి బెంగళూరు వరకు రోడ్డు వెడల్పు కోసం రూ.900 కోట్లు మంజూరు చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. వ్యాక్సినేషన్, ఆయుష్మాన్  కార్డ్, కిసాన్  సమ్మాన్  నిధి ఇంకా ఎన్నో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

బీఆర్ఎస్  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలె

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి మహేంద్రనాథ్ పాండే సూచించారు. అలాగే బీఆర్‌‌ఎస్‌‌   ప్రభుత్వ వైఫల్యాలు, బూటకపు వాగ్దానాలు, అమలుకు నోచుకోని హమీలపైనా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ సర్పంచులు పాలిస్తున్న గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఆ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్  అవినీతి సర్కార్ ను కూలగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నాటక రాజకీయాలపై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు వేరని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలో 28 సీట్లూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో జరిగినట్టు తెలంగాణలో జరగదని, తెలంగాణలో అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్  పగటి కలలు కనడం మానేయాలని సూచించారు.