మిల్లర్ల అక్రమాలను పట్టించుకోని కేసీఆర్ సర్కారు

మిల్లర్ల అక్రమాలను పట్టించుకోని కేసీఆర్ సర్కారు

రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కొన్ని మిల్లుల్లో అక్రమాలు జరిగినా కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకోకపోవడం వల్లే ధాన్యం కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో వడ్లు, బియ్యం సేకరణకు ఎఫ్సీఐకు అనుమతించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యహరించడం బాధాకరమని  అన్నారు. పేదలకు బియ్యం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించిన పీయూష్ గోయెల్.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా కేసీఆర్ సర్కారు పేదలకు అన్యాయం చేసిందని విమర్శించారు. 

ధాన్యం సేకరణ విషయంలో సీఎం కేసీఆర్ గోల్ మాల్ మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు వాటిని పట్టించుకోవద్దని  పీయూష్ గోయెల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మిల్లర్ల అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా.. పట్టించుకోవడం లేదని, 3 నెలలుగా పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పంపిణీ చేయడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య కేవలం తెలంగాణలోనే ఎందుకు వస్తోందని పీయూష్ గోయెల్ ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులపై విమర్శలు చేయడం అర్ధరహితమని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, ప్రజల కోసం ఆలోచిస్తుందని అనుకున్నామని,  కానీ రాజకీయాలు తప్ప ఇంకో విషయం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.