బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై ప్రచారం చేయండి: పీయూష్ గోయల్

బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై ప్రచారం చేయండి: పీయూష్ గోయల్
  • ఇంటింటికీ వెళ్లి వివరించండి: పీయూష్ గోయల్
  • రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలె  
  • బీజేపీ క్యాడర్​కు కేంద్ర మంత్రి పిలుపు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పదేండ్లుగా నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ నియంత పాలన.. కేసీఆర్, కేటీఆర్, కవిత చేసిన అవినీతిపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం యూసుఫ్ గూడలో జరిగింది. దీనికి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనలో పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని చెప్పారు. ‘‘అవినీతి కాంగ్రెస్ ను కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇక్కడి సమాజానికి అవినీతి పార్టీల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం ప్రజలకు జన్ ధన్ ఖాతాలు అందజేసింది. ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంది” అని చెప్పారు.

రాష్ట్రం సహకరించకున్నా ట్రైబల్ వర్సిటీ ఇచ్చినం.. 

మోదీ పాలనలో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదిగిందని గోయల్ చెప్పారు. ‘‘2047 నాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు అవుతుంది. అప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన అగ్రశేణి ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది” అని తెలిపారు. ‘‘మోదీ ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాతో యువతకు అనేక అవకాశాలు కల్పిస్తోంది. ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. దేశంలో దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. దేశంలో 100 శాతం ఇండ్లకు నల్లా నీటిని అందించేలా కృషి చేసింది. పంట నష్టపోయిన రైతులను ఫసల్ బీమా యోజనతో ఆదుకుంటోంది” అని తెలిపారు. రైతులకు మేలు చేసే ఫసల్‌బీమా యోజన పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు.  రైతులు, అన్ని వర్గాలు బాగుపడాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ యువత దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్నదని ప్రశంసించారు. 

రాష్ట్రంలో దోపిడీ పాలన: లక్ష్మణ్​ 

రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పాలన సాగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ‘‘4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ తెచ్చుకుంటే.. నలుగురి కోసమే అన్నట్లు దోపిడీ పాలన సాగుతోంది. అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణను భ్రష్టు పట్టించారు. కేసీఆర్ సర్కార్​పై తెలంగాణ సమాజం విసిగిపోయింది” అని లక్ష్మణ్​ పేర్కొన్నారు.