
మెహిదీపట్నం/నేరేడ్మెట్, వెలుగు: తెలంగాణ అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరికి తగిన గుర్తింపు దక్కలేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘‘యాదగిరిని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయం. యాదగిరి కష్టపడి పైకి వచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకు సరైన న్యాయం జరగలేదు” అని అన్నారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్గుడిమల్కాపూర్ లోని యాదగిరి ఇంటికి ప్రహ్లాద్ జోషి వెళ్లారు. ఈ సందర్భంగా యాదగిరి, ఆయన కుటుంబసభ్యులను సన్మానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాలతో యాదగిరిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఇంద్రసేనారెడ్డి, పాండు, గోవర్ధన్, దేవర వంశీ, నాగేంద్ర, ప్రకాశ్ రెడ్డి, నామ యాదగిరి, ముళ్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గరికపాటితో భేటీ..
ప్రధాని మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘మహాజన్ సంపర్క్అభియాన్’ ప్రోగామ్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సైనిక్‌పురిలోని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇంటికి వెళ్లారు. గరికపాటి తన ప్రవచనాలతో ప్రజలను మేల్కొలుపుతున్నారని ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ సందర్భంగా గరికపాటి దంపతులు కేంద్రమంత్రిని సత్కరించారు.