గుడిసెలో ఉంటాడు.. కేంద్రమంత్రి అయ్యాడు

గుడిసెలో ఉంటాడు.. కేంద్రమంత్రి అయ్యాడు
  • సోషల్ మీడియా హీరోగా మారిన ప్రతాప్ చంద్ర సారంగి

  • దటీజ్ మోడీ అంటున్న యూత్

ప్రతాప్ చంద్ర సారంగి. మామూలుగా అయితే ఈయన పేరు కొంతమందికే తెలుగు. ఈ సామాన్యుడే.. ఇపుడు ఇండియా అంతటా ప్రముఖంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేబినెట్ లో ఏకంగా మంత్రి అయ్యారు. సోషల్ మీడియా హీరో అయ్యారు. ఆయన గురించి ఓసారి తెల్సుకుందాం.

ప్రతాప్ చంద్ర సారంగి. జనవరి 4, 1955లో ఒడిషాలోని బాలాసోర్ జిల్లా గోపీనాథ్ పూర్ లో పుట్టారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఉండేది మాత్రం ఓ గుడిసె లాంటి చిన్న ఇంట్లో. బారు గడ్డం.. మీసాలతో… బికారిలా కనిపిస్తారు. కానీ.. ఆయన అసామాన్యుడు. సైకిల్ పైనే ఎక్కువగా తిరుగుతుంటారు. బోరింగ్ పంప్ దగ్గర స్నానం చేస్తారు. నిరాడంబరంగా ఉండటం ఆయన లైఫ్ స్టైల్. పేదలకు, అనాథ పిల్లలకు సేవ చేయడం ఆయన నైజం.

చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. డిగ్రీ చదివారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. వెస్ట్ బెంగాల్ లోని రామకృష్ణ మఠ్ లో సన్యాసిగా చేరాలనుకున్నారు. కానీ ఒంటరైన తన తల్లిని చూసుకోవాల్సింది తానే అని తెల్సుకున్న సారంగి… సామాజిక కార్యక్రమాల వైపు దృష్టిమళ్లించారు. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా అయిన సారంగిని.. అందరూ ‘ఒడిశా మోడీ’ అని పిలుస్తుంటారు.

2004, 2009ల్లో నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రతాప్ చంద్ర సారంగి గెలుపొందారు. గణశిక్షా మందిర్ యోజన స్కీమ్ కింద.. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో.. పేద పిల్లల చదువుల కోసం అనేక స్కూళ్లను ఏర్పాటుచేయించారు. ఎమ్మెల్యేగా వచ్చిన జీత భత్యాలను కూడా ఆయన ప్రజల కోసమే ఉపయోగించేవాడు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒడిశా బహిరంగ సభల్లో పలుమార్లు ప్రతాప్ చంద్ర సారంగి గొప్పతనం గురించి పొగుడుతూ ఉండేవారు.

సామాన్యుడైన సారంగిని 2014 లోక్ సభ ఎన్నికల్లో బాలాసోర్ నుంచి బరిలోకి దింపింది బీజేపీ. ఐతే… BJD అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు. 2019లోనూ బాలాసోర్ నుంచి ఎంపీగా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన సైకిల్ ను, ఆటోను మాత్రమే ఉపయోగించారు. ఐనా… ఈసారి ఎన్నికల్లో సారంగి ఎంపీగా గెలిచారు. ఇద్దరు ధనికులైన అభ్యర్థులను ఓడించారు. ఏకంగా నరేంద్రమోడీ సారథ్యంలో ఆయన కేంద్రమంత్రి కూడా అయ్యారు. మే 30న సారంగి ఢిల్లీలో ప్రమాణం చేశారు.

ప్రధాని మోడీ… ప్రతాప్ చంద్ర సారంగికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఇండియాలో, ఒడిశాలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు.. ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. బాలాసోర్ లో నీళ్లకు కరువు ఉందనీ… ఆ పరిస్థితి మార్చి ఇండియా టూరిజం మ్యాప్ లో ఉండేలా చేస్తానని చెప్పారు సారంగి. కుల్దిహా అభయారణ్యంలో ఏనుగులు ఎన్నో ఉన్నాయని.. ఆ ప్రాంతానికి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.