మూడేళ్లు బీజేపీ.. రెండేళ్లు శివసేన: రాజీకి కొత్త ఫార్ములా!

మూడేళ్లు బీజేపీ.. రెండేళ్లు శివసేన: రాజీకి కొత్త ఫార్ములా!
  • NDA భాగస్వామ్య పార్టీ నేత, కేంద్ర మంత్రి అథవాలే ప్రతిపాదన

మహారాష్ట్ర పంచాయతీ ఎంతకీ తేలేలా లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఫెయిల్ కావడంతో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోందక్కడ. ఆ తర్వాత కూడా ఎన్సీపీ – కాంగ్రెస్‌లతో కలిసి శివసేన సర్కారు ఏర్పాటు చేయబోతోందంటూ నిన్నటి దాకా ప్రకటనలు చేశాయి ఆ మూడు పార్టీలు. చెరో రెండున్నరేళ్లు (50:50 ఫార్మాలా) సీఎం పదవి పంచుకోవాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీతో ఆ పార్టీకి బ్రేక్ అయిన బంధం మళ్లీ అతుక్కునే చాన్స్ ఉందన్న వార్తలు మొదలయ్యాయి. బీజేపీ – శివసేన మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఇవాళ కామెంట్ చేశారు.

బీజేపీతో మాట్లాడుతా

ఇవాళ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో మాట్లాడారు కేంద్ర మంత్రి అథవాలే. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేన, బీజేపీ రాజీ గురించి తాను చర్చించానని చెప్పారు. మూడేళ్లు బీజేపీ, రెండేళ్లు శివసేన ముఖ్యమంత్రులు పాలించేలా కొత్త ఫార్ములాను ప్రతిపాదించానన్నారు. అయితే ముందు బీజేపీ ఓకే అంటే అప్పుడు ఆలోచిద్దామని సంజయ్ రౌత్ చెప్పారని వివరించారు అథవాలే. ఈ విషయంపై తాను బీజేపీతోనూ మాట్లాడుతానని చెప్పారాయన. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన మహారాష్ట్రకు చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న ఆయన ఈ కామెంట్స్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.