తప్పు చేస్తే కొడుకునైనా క్షమించను.. కుమారుడి పోక్సో కేసుపై స్పందించిన బండి సంజయ్

తప్పు చేస్తే కొడుకునైనా క్షమించను.. కుమారుడి పోక్సో కేసుపై స్పందించిన బండి సంజయ్

కరీంనగర్: తన కుమారుడు బండి భగీరథ్‎పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. మంగళవారం (మే 12) కరీంనగర్‎లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో బిజీ అయ్యి నా కుమారుడికి టైమ్ ఇయ్యలేకపోయానన్నారు. నా కొడుకును క్రిమినల్‎గా చూపే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ నేను ఏ తప్పు చేయలేదని నా కుమారుడు చెబుతున్నాడన్నారు. అయినప్పటికీ నా కొడుకును సమర్థించడం లేదని.. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. 

నిజంగా తప్పు చేసినట్లు తేలితే నా కొడుకును కూడా క్షమించనని స్పష్టం చేశారు. నా కుమారుడిపై జరుగుతున్నన దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితమంతా కష్టాలు, బాధలేనని.. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైన భయపడి పారిపోయే వాడిని కాదన్నారు. నా కుటుంబాన్ని రోడ్డుకు లాగి నా మీద కుట్రలు చేసి, నా పార్టీని ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 

కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‎పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పేట్ బషీర్‎బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మహిళా ఐపీఎస్​ఆఫీసర్​రితిరాజ్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి సోమవారం మెమో జారీ చేశారు.

కేసుకు సంబంధించిన అన్ని అంశాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశీలించాలని సీపీ రమేశ్ రెడ్డి ఆదేశించారు. వృత్తిపరమైన పద్ధతిలో నిబంధనలకు లోబడి దర్యాప్తు జరిగేలా చూడాలని సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతిరోజూ తప్పనిసరిగా సమర్పించాలని సీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే కేసు విచారణను డీసీపీ రితిరాజ్‌ ముమ్మరం చేశారు.