టీ ఫైబర్ పైలెట్ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శం..డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

టీ ఫైబర్ పైలెట్ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శం..డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
  • సరికొత్త డిజిటల్ విధానాలకు తెలంగాణ బాటలు వేస్తున్నదని కామెంట్
  • హైస్పీడ్ కనెక్టివిటీ అందించేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
  • ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సుకు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించడంలో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీ -ఫైబర్’ గ్రామాల పైలెట్ ప్రాజెక్టు.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. ఢిల్లీలోని యశోభూమి ఐఐసీసీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సు బుధవారం ప్రారంభమైంది. 

ఇందులో భాగంగా ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేబుల్’ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌‌ర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. ‘‘సరికొత్త డిజిటల్ విధానాలకు తెలంగాణ బాటలు వేస్తున్నది. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని ‘లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ’ ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించింది. ‘టీ-ఫైబర్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలి. ఈ పైలెట్ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి’’అని సింధియా కోరారు.

డిజిటల్ గ్యాప్ తగ్గిస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

గ్రామీణ, పట్టణాల మధ్య ఉన్న డిజిటల్ గ్యాప్​ను తగ్గిస్తున్నామని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. దీని కోసం పక్కా ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘‘డిజిటల్ రంగంలో సరికొత్త విధానాలతో ముందుకెళ్తున్నం. భావితరాల కోసం పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నం. డిజిటల్ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిట్టచివరి వ్యక్తి వరకు చేరాలన్నదే మా లక్ష్యం. 

టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీ అందించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఫైబర్ -టు -ది-హోమ్ నెట్‌‌వర్క్ ద్వారా ఈ -గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేర్చుతున్నాం’’అని చెప్పారు. ‘భారత్ నెట్’ అమల్లో వేగం పెంచాలని, రైట్ ఆఫ్ వే సవాళ్లను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.