తెల్లాపూర్​ మున్సిపాలిటీలో రైల్వే సమస్యలను పరిష్కరిచండి : ఎంపీ రఘునందన్​రావు​

తెల్లాపూర్​ మున్సిపాలిటీలో రైల్వే సమస్యలను పరిష్కరిచండి : ఎంపీ రఘునందన్​రావు​
  • కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను కోరిన ఎంపీ రఘునందన్​రావు​

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీలో రైల్వే సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్నను ఎంపీ రఘునందన్​రావు కోరారు. శనివారం బీదర్​ పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రికి తెల్లాపూర్​ మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ రఘునందన్​ఆధ్వర్యంలో నాగులపల్లి రైల్వే స్టేషన్​ను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలు, అభివృద్ధిపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఎంఐజీ కాలనీ, తెల్లాపూర్​ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న రైల్వే అండర్​ పాస్ ఇబ్బందికరంగా మారిందని వెంటనే పునరుద్ధరించాలని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో మరికొన్ని ఆర్​యూబీలు నిర్మించాలని, వీటివల్ల రాకపోకల రద్దీని నివారించవచ్చని మంత్రికి తెలిపారు. చర్లపల్లి రైల్వే టర్మినల్​ మాదిరిగానే ఈదులనాగులపల్లిలో కూడా టర్మినల్​ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికోసం 508 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొల్లూరు, వెలిమెల, నాగులపల్లి మధ్య ఆర్​ఓబీలు పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రైల్వే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్​అధ్యక్షుడు రాంబాబు గౌడ్​, మాజీ కౌన్సిలర్​ శంషాబాద్​ రాజు, కమిషనర్​ సంగారెడ్డి పాల్గొన్నారు. 

మంచి పనులతో చిరకాల గుర్తింపు

మెదక్, వెలుగు: ప్రజల కోసం చేసే  మంచి పనులతో చిరకాల గుర్తింపు లభిస్తుందని ఎంపీ రఘు నందన్​ రావు​ అన్నారు. శనివారం మెదక్ వినాయక కన్వెన్షన్​లో జరిగిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  అంచెలంచెలుగా ఎస్పీ స్థాయికి ఎదిగిన ఉదయ్​ కుమార్​రెడ్డి 44 ఏళ్ల తన సర్వీస్​లో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, తన అనుభవంతో కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేశారన్నారు.  

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు​ మాట్లాడుతూ ఎస్ఐగా పోలీస్​ శాఖలో చేరిన ఉదయ్​ కుమార్ రెడ్డి ఎస్పీ స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మల్టీ జోన్​1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, కలెక్టర్​రాహుల్​రాజ్​, ఏఎస్పీ మహేందర్ తదితరులు ఉద్యోగ విరమణ పొందతున్న ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డిని ఘనంగా సన్మానించారు. సాయంత్రం జిల్లా పోలీస్​ ఆఫీస్​లో పోలీస్​అధికారులు, సిబ్బంది ఎస్పీ ఉదయ్​కుమార్​ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. 

అహల్యా బాయి హోల్కర్​ సేవలు ఆదర్శం

అహల్యా బాయి హోల్కర్​ సామాజిక సేవలు ఆదర్శమని ఎంపీ రఘునందన్​ రావు​ అన్నారు. బీజేపీ జిల్లా ఆఫీసులో శనివారం మహారాణి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహల్యా బాయి హోల్కర్​ పలు  హిందూ దేవాలయాలను పునర్ణిర్మించారని, ధర్మశాలలను నిర్మించి ప్రఖ్యాతిగాంచారన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు ఎంఎల్​ఎన్​రెడ్డి, శ్రీనివాస్, నాయకులు సుభాష్ గౌడ్, రాజేందర్, సత్యనారాయణ, వీణ, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.