పవర్​హౌస్​లు ఎందుకియ్యలే?

పవర్​హౌస్​లు ఎందుకియ్యలే?

 

  • కృష్ణా ప్రాజెక్టుల విద్యుత్​ కేంద్రాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి
  • వీలైనంత తొందరగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం 
  • కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో రివ్యూ

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా ప్రాజెక్టులపై ఉన్న పవర్​హౌస్​లను బోర్డుకు ఎందుకు అప్పగించలేదని, గెజిట్​ అమలు ఎంతదాకా వచ్చిందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్​ కుమార్​ ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన గెజిట్​ అమలుపై కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్​, చంద్రశేఖర్​ అయ్యర్​, బోర్డుల మెంబర్​ సెక్రటరీలు డీఎం రాయ్​పురే, బీపీ పాండేలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఫుల్​ బోర్డు సమావేశాలు, సబ్​ కమిటీ సమావేశాల్లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్లు వివరించారు. బచావత్​ ట్రిబ్యునల్​ ప్రకారం ప్రాజెక్టుల రూల్​ కర్వ్స్​ను తేల్చకుండా ఔట్​లెట్లను ఇచ్చేందుకు తెలంగాణ ఒప్పుకోవట్లేదని తెలిపారు. గోదావరిపై ఒక్క పెద్దవాగు ప్రాజెక్టును ఇచ్చేందుకు మాత్రమే రెండు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. అయితే, తెలంగాణలోని అన్ని ఔట్​లెట్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఏపీ కోరుతోందని, కానీ, తెలంగాణ మాత్రం ఒప్పుకోవట్లేదని వివరించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్​ కేంద్రాన్ని ఇచ్చేందుకు ఏపీ జీవో ఇచ్చినా.. లెఫ్ట్​ బ్యాంక్​ పవర్​ హౌస్​ను స్వాధీనం చేసుకున్నాకే తమ పవర్​ హౌస్​నూ తీసుకోవాలంటూ మెలిక పెట్టిందని చెప్పారు. శ్రీశైలంతో పాటు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల పవర్​హౌస్​ల స్వాధీనంపై తెలంగాణ ఇరిగేషన్​ స్పెషల్​ సీఎస్​కు లేఖ రాశామని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన జలశక్తి శాఖ కార్యదర్శి.. బోర్డుల పరిధి ఇప్పటికే అమల్లోకి వచ్చేసిందని, వీలైనంత తొందరగా ప్రాజెక్టుల ఔట్​లెట్లు, పవర్​హౌస్​లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.