సకల జనులను ఏకం చేసి.. ఉద్యోగులమే ఆగమైనం

V6 Velugu Posted on Oct 19, 2021

  • కేసీఆర్​ హామీలు నెరవేరుతలేవు    మాజీ ఎమ్మెల్సీ మోహన్​ రెడ్డి

హుజూరాబాద్​టౌన్, వెలుగు: సకలజనుల సమ్మె సైరన్​ఊది సబ్బండ వర్గాలను ఏకం చేసింది ఉద్యోగులు, టీచర్లేనని.. స్వరాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతయని అనుకున్నామని, నాడు పోరాటాలకు సహకరించిన తామే నేడు ఆగమౌతున్నామని మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్​ టీచర్​ ఎంప్లాయీస్​ బీజేపీ సెల్​ చైర్మన్​ మోహన్​రెడ్డి అన్నారు. హుజూరాబాద్​లోని మధువని గార్డెన్​లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈటల రాజేందర్​గెలిస్తే ఏం చేస్తాడని కొందరు విమర్శిస్తున్నారని.. ఆయన గెలిస్తే రాష్ట్రంలో అనేక మార్పులు వస్తాయని చెప్పారు. 
25 ఏండ్లు పీఆర్టీయూ నాయకుడిగా ఉన్నానని, తన కెరీర్​లో 15 మంది సీఎంలను చూశానని..  కానీ ఇప్పటివరకు ఎవరూ చేయనంత మోసం కేసీఆర్​చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ కారణంగా పాలన కుంటుపడిందని, విద్యావవస్థ భ్రష్టుపట్టిందని, ఎంఈవో, టీచర్​ఖాళీలు భర్తీ చేయలేని దుస్థితి దాపురించిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తానంటూ చర్చలకు పిలిచి ఆరేండ్లు గడిచాయని, నేటికీ పరిస్థితి ఏ మాత్రం మారలేదన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అప్పట్లో  రాజశేఖర్ రెడ్డిని కోరితే 1వ తేదీన ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతం వచ్చేదని, ఇప్పుడు ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తదో అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగ బంధు, టీచర్​బంధు కూడా ప్రవేశపెట్టాలని, ఒకేసారి అకౌంట్​లో రూ. 10 లక్షల వేసి అందులోంచి నెలనెలా వేతనాలు తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని సూచించారు.
 ప్రజలు, ఉద్యోగులు, టీచర్లు అంతా కలిసి ఈటలను గెలిపిస్తే రాష్ట్రంలో మార్పు వస్తుందని మోహన్​రెడ్డి చెప్పారు. ఈటల రాజేందర్​ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో సేవలందాయని, ప్రస్తుతం హరీశ్​రావు హయాంలో ఆ సేవలు అందడం లేదని బీజేపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సెల్​రాష్ట్ర కో చైర్మెన్​ వెంకటరెడ్డి ఆరోపించారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, రిటైర్డ్​ఎంప్లాయీస్​లీడర్లు విజయలక్ష్మి, రత్నాకర్​, గట్ల నర్సిరెడ్డి, వీరస్వామి, మనోహర్​కుమార్, నరోత్తంరెడ్డి, రాజన్న, వెంకటరెడ్డి, నరేందర్, మంజులారెడ్డి  పాల్గొన్నారు.
 

Tagged Telangana, Karimnagar, Employees, Election Campaign, Huzurabad, by-election campaign, kcr promises, ex mlc mohan reddy

Latest Videos

Subscribe Now

More News