చాలీచాలని జీతాలతో భద్రత లేని జీవితాలు

చాలీచాలని జీతాలతో భద్రత లేని జీవితాలు
  • ఇబ్బందుల్లో అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా లైన్​మెన్ల కింద పని చేస్తున్న 1,400 మంది
  • ప్రమాదానికి గురైతే పట్టించుకునేవారే లేరు
  • ఎన్ఎంఆర్​లుగా గుర్తిస్తామన్న సీఎం.. నెరవేరని హామీ


మంచిర్యాల, వెలుగు: విద్యుత్ శాఖలో లైన్​మెన్ల కింద పనిచేసే అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలీచాలని జీతాలతో భద్రత లేని జీవితాలు గడుపుతున్నారు. లైన్​మెన్లకు సపోర్ట్​గా ఉండే పనులే కాకుండా అగ్రిమెంటులో లేని వర్క్స్​ సైతం చేస్తున్నారు. రాత్రనక పగలనక పోల్స్​ఎక్కుతూ కష్టపడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం జరిగి వర్కర్ల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరికొందరు కాళ్లు చేతులు కోల్పోయి, కోమాలోకి వెళ్లి జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తుందన్న ఆశతో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. అయినప్పటికీ సర్కారు తమపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో నాన్​మస్టర్​రోల్(ఎన్ఎంఆర్) స్టాఫ్​ను పర్మినెంట్​చేసిన ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా1,600 మంది అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్​వర్కర్లను నియమించింది. టెండర్లు నిర్వహించి ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి అనుభవం ఉన్న వర్కర్లను కాంట్రాక్టర్ల ద్వారా అపాయింట్ చేసింది. ఇందులో కొంతమంది కరెంట్​షాక్​తో చనిపోగా, మరికొందరు వికలాంగులుగా మారారు. కొందరు జూనియర్​ లైన్​మెన్లుగా సెలెక్టయ్యారు. ప్రస్తుతం సుమారు 1,400 మంది ఉన్నారు. విద్యుత్ శాఖలో లైన్​మెన్ల కింద వీరు పని చేస్తున్నారు. 

53 మంది మృతి.. వికలాంగులైన 23 మంది

అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్​ వర్కర్ల ప్రాణాలకు కనీస భద్రత కరువైంది. లైన్​మెన్లకు సపోర్టుగా మాత్రమే వర్క్​చేయాల్సి ఉండగా అన్ని పనులూ వీళ్లకే చెప్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, పోల్స్​ఎక్కుతూ అన్ని రకాల రిపేర్లు చేయిస్తున్నారు. కొన్నిసార్లు లైన్​మెన్​ నిర్లక్ష్యంతో ఎల్ సీ ఇవ్వకపోవడం, ఇచ్చినా మరో లైన్ నుంచి కరెంట్​సప్లై కావడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 53 మంది అన్​మ్యాన్డ్​డిస్ట్రిబ్యూషన్​వర్కర్ల ప్రాణాలు గాలిలో కలిశాయి. మరో 23 మంది కరెంట్​షాక్​తో కాళ్లు చేతులు పోగొట్టుకున్నారు. వికలాంగులుగా మారి మంచానికే పరిమితమై అష్టకష్టాలు పడుతున్నారు.  మృతుల కుటుంబాలకు ఇతరుల మాదిరిగానే ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకొంటోంది. కరెంట్​షాక్​తో గాయపడ్డ వాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్స్​లో ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్​చేయించకుండా ఈఎస్ఐలో అరకొర వైద్యం అందిస్తుండడంతో ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. 

ఇచ్చేదే కొంత... అందులోనూ దోపిడీ 

అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్​వర్కర్లకు ప్రభుత్వం నెలకు రూ.14,727 జీతం ఫిక్స్ చేసింది. రూ.2,247ఈఎస్ఐ, ఈపీఎఫ్​తదితర కటింగులు పోను రూ.12,480 కాంట్రాక్టర్ల అకౌంట్లలో జమ చేస్తోంది. కాంట్రాక్టర్లు పలురకాల కటింగ్​లు అంటూ రూ.8,500 మాత్రమే వర్కర్ల చేతిలో పెడుతున్నారు. జీతం తక్కువయినప్పటికీ ఉద్యోగాలు పర్మినెంట్​అవుతాయనే ఆశతో ఏడేండ్లుగా నెట్టుకొస్తున్నారు. లైన్​మెన్లకు సపోర్ట్​గా మాత్రమే ఉంటారని అగ్రిమెంట్​లో పేర్కొన్నప్పటికీ ట్రాన్స్​ఫార్మర్లు, పోల్స్​ఎక్కడం వరకు అన్ని పనులూ వీళ్లతోనే చేయిస్తున్నారు. సీఎం కేసీఆర్​2018లో అసెంబ్లీలో అన్​మ్యాన్డ్​ వర్కర్ల గురించి ప్రస్తావిస్తూ ఎన్ఎంఆర్​లుగా గుర్తించి పర్మినెంట్​చేస్తామని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు నెరవేరకపోగా, కనీస వేతనాలు కూడా రాక పాట్లు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా తమను సర్కారు పర్మినెంట్​చేయాలని కోరుతున్నారు. 

పోల్​పైనే ప్రాణం పోయింది 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బి.వాల్య లింగాల సబ్​ డివిజన్​లో అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్​ వర్కర్​గా చేసేవాడు. 2020 జనవరి 18న పోల్​ఎక్కి పని చేస్తుండగా కరెంట్​షాక్​ తగిలి స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు. ఆయన కుటుంబానికి కరెంట్​డిపార్ట్​మెంట్​నుంచి రూ. 5 లక్షల ఎక్స్​గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ బిడ్డ దివ్య, కొడుకు జగదీశ్​ను డిగ్రీ చదివిస్తోంది. కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్యామిలీలో ఒకరికి ఔట్​సోర్సింగ్​జాబ్​ ఇస్తామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. సావిత్రి ఒంటరి మహిళ పెన్షన్​కు అప్లై చేసుకున్నా పెన్షన్​ రావట్లేదు. 

చేయి పోయింది.. అప్పు మిగిలింది

వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన ఉండ్రాతి గోపాల్​నెక్కొండ సబ్​డివిజన్​లో అన్​మ్యాన్డ్​ డిస్ర్టిబ్యూషన్​ వర్కర్. 2017 డిసెంబర్​7న రాత్రి ఒంటిగంటకు కరెంట్​సప్లై నిలిచిపోడంతో మూడు పోల్స్​ఎక్కి రిపేర్లు చేశాడు. పొద్దుట 6 గంటలకు మరో పోల్​ఎక్కి సరిచేస్తుండగా కరెంట్​షాక్​తగిలి కిందపడ్డాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ కుడి చేయి మోచేతి వరకు తొలగించారు. ట్రీట్​మెంట్​కు రూ.21 లక్షలు ఖర్చయింది. ఆపరేటర్, లైన్​మెన్​రూ.5 లక్షలు ఇవ్వగా, డిపార్ట్​మెంట్​నుంచి రూ.6 లక్షలు ఇచ్చారు. ఎకరం భూమి అమ్మి, అప్పు చేసి మిగతా రూ.10 లక్షలు చెల్లించారు. ప్రస్తుతం అతడు అదే పనిచేస్తున్నా రూ.8 వేల జీతం మాత్రమే వస్తోంది. దాంతో భార్య, ఇద్దరు బిడ్డలు, కొడుకును పోషించుకోవడం కష్టమవుతోంది. ఇంకా రూ.5లక్షల అప్పు మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం సూరారం గ్రామానికి చెందిన మంచికట్ట సత్తయ్య కొన్నేళ్లుగా అన్​మ్యాన్డ్​ డిస్ట్రిబ్యూషన్​వర్కర్​గా చేస్తున్నాడు. ఈ నెల 21న లక్ష్మీపూర్​స్టేజీ వద్ద గల రైస్​మిల్​ఫ్యూజ్​వేస్తుండగా కరెంట్​షాక్ తగిలి పోల్​పైనుంచి కిందపడ్డాడు. కుటుంబీకులు మొదట కరీంనగర్​కు, అక్కడి నుంచి హైదరాబాద్​లోని ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. సత్తయ్యకు వెన్నుపూస దెబ్బతిన్నదని, ఆపరేషన్​కు రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కాంట్రాక్టర్​ఇన్సూరెన్స్​కట్టకపోవడంతో ఈఎస్ఐ కార్డు రాలేదు. దీంతో ట్రీట్​మెంట్​ఖర్చులకు ఫ్యామిలీ మెంబర్లు ఇబ్బంది పడుతున్నారు.