
అకాల వర్షాలు, వడగండ్లు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. ఓవైపు కోతకొచ్చిన వరి, మొక్కజొన్న నేల వాలుతుండగా, మరోవైపు కోసి కుప్పలు పోసిన వడ్లు, మక్కలు తడుస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లరాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లలో వడ్ల రాశులు పేరుకుపోతున్నాయి. వాన, వరద నుంచి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ఆఫీసర్లు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం లేదని, దీంతో కళ్లముందే ధాన్యం కొట్టుకపోతున్నా ఏం చేయ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇస్తున్నారు. కానీ బాగున్న ధాన్యాన్ని తీసుకునేందుకే రైస్ మిల్లర్లు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని తీసుకుంటారనే గ్యారెంటీ లేదని అన్నదాతలు చెబుతున్నారు.
27,380 మంది రైతులు..
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు 61 వేల ఎకరాల్లోపంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను ప్రభుత్వా నికి పంపించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగిన పంట నష్టాన్ని లెక్కకట్టింది. ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. 59 వేల ఎకరాల్లోవరి పంటకే నష్టం వాటిల్లింది. తీవ్ర గాలులు, వడగండ్లకు గింజలు పంట పొలాల్లోనే రాలిపోయాయి. కోత కోసి కుప్ప పోసిన ధాన్యం కూడా తడిసిందని వ్యవసాయ శాఖ నివేదించింది. జొన్న పంట వెయ్యి ఎకరాల్లో దె బ్బతిన్నది. స్కేల్ ఆఫ్ రిలీఫ్ ప్రకారం ప్రాథమిక నష్టం అంచనా రూ.331 కోట్లుగా లెక్కించారు.
మహబూబ్‌న గర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, నల్గొండ, వనపర్తి, మెదక్, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జనగాం, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట, సిద్దిపేట, జయశం కర్ భూపాలపల్లి, వికారాబాద్, మహబూబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. మొత్తం 150 మండలాల్లో 27,380 రైతులు అకాల వర్షాలకు నష్ట పోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. పంట నష్టంపై పూర్తి అంచనాకు త్వరలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 1482 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. ఇందులో 1362 హెక్టార్లలో వరి, 120 మెక్టార్లలలో మొక్కజొన్న పంట దెబ్బతిం ది. 2,361 మంది రైతులు నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలో 500 ఎకరాల్లోవరి నేలవాలిం ది. వంద ఎకరాల్లోమామిడి కాయలు రాలిపోయా యి. అధికారులు మాత్రం ఒక్క హుజురాబాద్ మండలంలో 258 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు చెప్తున్నారు. జగిత్యాల జిల్లాలో వరి, నువ్వు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. 10,393 ఎకరాల్లోమూడోవంతు మామిడి పంట డ్యామేజ్ కాగా, 2,521 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిం ది. మెదక్ జిల్లాలో అకాల వర్షాలకు మొత్తం 5,395 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 5,253 ఎకరా ల్లోవరి, 100 ఎకరాల్లోమొక్కజొన్న, 14 ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. 28 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో నెలరోజుల్లో మూడుసార్లు వడగండ్లవానలు పడడంతో 6,885 ఎకరాల్లోవరి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 950 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. . కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లుకూడా కొన్ని చోట్ల తడిసిపోయాయి. యాదాద్రి జిల్లాలోని17 మండలాల్లో నెలరోజుల్లో ఆరుసార్లు వానలు పడ్డాయి. దీంతో 25,091 ఎకరాల్లో వరి పంటదెబ్బ తినగా, 17 వేల మంది రైతులు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, దమ్మపేట, జూలూరుపాడు, ములకలపల్లి, బూర్గం పహాడ్ మండలాల్లోదాదాపు 80 ఎకరాల్లోఅరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. అశ్వాపురంలో 800 ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగింది. మహబూబ్నగర్ జిల్లాలోని రూరల్, నవాబ్ పేట, గండీడ్, హన్వాడ, దేవరకద్ర మండలాల్లో 750 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. దేవరకద్ర మార్కెట్కు తీసుకొచ్చిన వడ్లు తడిసిపో యాయి. గండీడ్ మండలంలో కొనుగోలు కేంద్రా లకు తెచ్చిన వడ్లు కొట్టుకుపోయాయి.