150 ఎకరాల్లో నేలరాలిన మామిడి..రైతులకు తీరని నష్టం

150 ఎకరాల్లో నేలరాలిన మామిడి..రైతులకు తీరని నష్టం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. తాళ్లగురిజాల, అంకూశం, మాలగురిజాల, బట్వాన్‌పల్లి, పర్కపల్లి, ఆకెనపల్లి, కన్నాల, చౌటుపల్లి, బోయపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 150 ఎకరాల్లో కోతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. బెల్లంపల్లి డివిజన్ ఉద్యానవన అధికారి జక్కుల అర్చన గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. అకాల వర్షాల కారణంగా ఈ ఏడాది బెల్లంపల్లి డివిజన్‌లో 250 నుంచి 350 ఎకరాల్లో మామిడి పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు. రైతులకు నష్టపరిహారం అందేలా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. 

కోత సమయంలో ముంచెత్తిన గాలివాన

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండలంలో మంగళవారం రాత్రి గురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని సారంగపల్లి, పొన్నారం, వెంకటాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. సారంగపల్లి కేంద్రంలో వడ్డు కొట్టుకుపోయాయి. కాంటా చేసిన వడ్ల బస్తాలు సైతం తడిశాయి.  కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని బుధవారం బీజేపీ లీడర్లు సంజీవరావు, వంజరి వెంకటేశ్, మండల కమిటీ లీడర్లు పరిశీలించారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్​చేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు రంజిత్, రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.