సిటీలోని స్కూల్ ​జోన్లలో కనిపించని జీబ్రా క్రాసింగ్ లైన్లు, స్పీడ్ బ్రేకర్లు

సిటీలోని స్కూల్ ​జోన్లలో కనిపించని జీబ్రా క్రాసింగ్ లైన్లు, స్పీడ్ బ్రేకర్లు

హైదరాబాద్, వెలుగు:  సిటీలో చాలా చోట్ల స్కూళ్ల పరిసరాల్లో  స్కూల్​జోన్ బోర్డులు, రోడ్లపై స్పీడ్​ బ్రేకర్లు కనిపించడం లేదు. స్కూల్​ ఎదట జీబ్రా క్రాసింగ్ గుర్తులు ఉండటం లేదు. అక్కడ స్కూల్​ఉందని వాహనదారులను ఈ గుర్తులు అలర్ట్​ చేస్తుంటాయి. దీంతో వెహికల్స్​ స్పీడ్ కంట్రోల్​లో ఉంటుంది. కానీ రోడ్లకు పక్కనే ఉన్న చాలా స్కూళ్ల దగ్గర ఇలాంటి గుర్తులేవీ కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే పిల్లలు రోడ్లు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.  స్కూల్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంవల్ల ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్కూల్ దగ్గర రోడ్డు దాటేందుకు స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడాది రోడ్ సేఫ్టీకి సంబంధించి స్కూల్ మేనేజ్‌‌‌‌మెంట్లకు, బల్దియా, ట్రాఫిక్ పోలీసులు దీనిపై సమావేశం జరుపుతారు. ఇందులో భాగంగా సిటీలోని స్కూళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఈ ఏడాది జూన్‌‌‌‌లో ఆ కార్యక్రమం జరిగి కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు.  జీహెచ్‌‌‌‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు విషయాన్ని చెప్పి వాటిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత స్కూల్ మేనేజ్‌‌‌‌మెంట్లపై ఉంటుంది. కానీ చాలా మేనేజ్‌‌‌‌మెంట్లు దీన్ని గాలికొదిలేస్తున్నాయి. 

కొన్ని ఏరియాల్లో ఇవీ ఇబ్బందులు..

  • కూకట్‌‌‌‌పల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్ దగ్గరలోనే ముంబయి హైవే ఉంది. ఆ రోడ్డు పక్కన నుంచి ఎంతోమంది పిల్లలు వస్తుంటారు. దాదాపు రెండు, మూడు వందల మంది పిల్లలు రోజూ డివైడర్ మధ్య నుంచి గ్యాప్‌‌‌‌లో నుంచి అవతలకు దాటి వెళ్తున్నారు. స్కూల్​కు​, రోడ్‌‌‌‌కు మధ్య 200 మీటర్ల దూరం ఉంటుంది. 
  • నిజాంపేటలోని ఒక స్కూల్​ వద్ద  ఎన్‌‌‌‌సీసీ స్టూడెంట్ల సాయంతో పిల్లలను రోడ్డు దాటిస్తున్నారు. 
  • మియాపూర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రూట్​లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ పిల్లలు రోడ్లు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 
  • భరత్​నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ  స్కూల్​లో బెల్‌‌‌‌ కొట్టేసి టీచర్లు, స్టాఫ్ అంతా పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. అక్కడ రోడ్ దాటే క్రమంలో స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. నాలుగు స్కూల్స్‌‌‌‌ ఆనుకుని ఉన్నా ఎక్కడా స్పీడ్ బ్రేకర్లు కనిపంచడం లేదు. దాదాపు 4 వేల మంది పిల్లలు ఒకేసారి రోడ్లమీదకు రావడం వల్ల రద్దీ వాతావరణం ఏర్పడుతోంది. 

మేనేజ్ మెంట్, అధికారులు బాధ్యత తీసుకోవాలి 

స్కూళ్ల దగ్గర జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు, యూటర్న్‌‌‌‌‌‌‌‌లు, స్కూల్ జోన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌లు ఉండాలి. వీటిని ప్రభుత్వం పట్టించుకోనప్పుడు స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వాళ్లే ఆఫీస్ బాయ్స్‌‌‌‌‌‌‌‌, స్టాఫ్​ను పెట్టి పిల్లలను రోడ్ దాటించే బాధ్యత తీసుకోవాలి. చాలా చోట్ల ఈ సమస్య ఉన్నప్పటికీ ఈ విషయంలో స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కంటే ఆర్ అండ్ బీ అధికారులు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. 

‌‌‌‌‌‌‌‌- శివరాజ్, ప్రైవేటు స్కూల్ టీచర్