పట్నం సల్లవడ్డది.. పల్లె ఆగమైంది..ఇదేం వాన

పట్నం సల్లవడ్డది.. పల్లె ఆగమైంది..ఇదేం వాన
  • అకాల వర్షంతో రైతులు ఆగమాగం
  • కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • రాలిన మామిడికాయలు
  • వేల ఎకరాల్లో పంట నష్టం
  • నిజామాబాద్‌లో రాళ్ల వాన బీభత్సం 
  • హైదరాబాద్​లో ఉరుములు, మెరుపులు
  • మరో మూడో రోజులు ఎల్లో అలెర్ట్​ 
  • గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • వాతావరణ శాఖ ప్రకటన

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, హనుమకొండ, వరంగల్,​ నిజామాబాద్‌ జిల్లాల్లో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. వేల ఎకరాల్లో వరి,మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్​జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు చెట్లు, కరెంట్ పోల్స్ నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. ఇందల్వాయి,మోపాల్, ఆలూరు, రేంజల్, దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, ఆర్మూర్, ​నిజామాబాద్‌ రూరల్‌, రెంజల్‌ మండలాల్లోని కల్లాలు నీటమునిగాయి.  ఎదిగిన నువ్వు పంట దెబ్బతిన్నది.ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. 

సిటీలో ఉరుములు, మెరుపులు

హైదరాబాద్:సిటీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శంషాబాద్, ఆదిభట్ల, తుర్కయాంజల్, రాజేంద్రనగర్, చార్మినార్, నాంపల్లి, మలక్​పేట్, దిల్​సుఖ్​నగర్,​ కొత్తపేట, చైతన్యపురి, నాగోల్, సరూర్​నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్​నగర్,​ బాలాపూర్,​ చంపాపేట, సైదాబాద్‌, అబిడ్స్, కాచిగూడ, అంబర్​పేట, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, సికింద్రాబాద్, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, మాసబ్‌ ట్యాంక్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్​పేట., మణికొండ, గచ్చిబౌలి, మెహదీపట్నం, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, టోలిచౌకి, గోల్కొండ,  తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ప్రధాన సెంటర్లలో భారీగా ట్రాఫిక్​జామ్​అయ్యింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

రెయిన్​అలెర్ట్ 

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట,  మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. 

రేపు(ఆదివారం) ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు.. ఎల్లుండి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్​హెచ్చరికలు చేశారు.